![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_9316-1024x768.jpg)
కుందేళ్లు మనందరికీ తెలుసు. ముద్దు ముద్దుగా… బొద్దు బొద్దు గా ఉండే కుందేళ్లు అంటే ఇష్ట పడని వారుండరు. వాటిని అమితంగా ప్రేమించే కొంతమంది పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు కూడా. అయితే కుందేళ్లను పెంచుతూ లాభాలు గడిస్తున్న వారు ఉన్నారని మీకు తెలుసా.. ఆయనే కొత్త సురేంద్ర రెడ్డి గారు… దాదాపు మూడేన్నరేళ్లుగా కుందేళ్లను పెంచుతూ.. వాటిని ఎవరికి, ఎలా విక్రయిస్తున్నారు. జీవన విధానం ఏంటిది.. ఏం ఆహారం అందిస్తున్నారు తదితర అంశాలను మన రైతుబడితో పంచుకున్నారిలా..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో.. నాగార్జున సాగర్ హైవే, విజయవాడ హైవే కి మధ్యలో ఉన్న కోహెడ గ్రామంలో కుందేళ్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకొని ఓ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాను. నాకు మొత్తం మూడు ఎకరాల సొంత భూమి ఉంది. అందులో 400 గజాల స్థలంలో 120 అడుగుల పొడవు 30 అడుగుల వెడెల్పుతో షెడ్ నిర్మాణం చేపట్టాను. ఈ షెడ్ నిర్మాణానికి దాదాపు రూ.4లక్షల వరకు ఖర్చయింది.
మూడు యూనిట్లతో మొదలై..
నేను కుందేళ్ల పెంపకం ప్రారంభంలో మూడు యూనిట్లను కొనుగోలు చేశాను. యూనిట్ కు ఎనిమిది ఆడ కుందేళ్లు, రెండు మగ కుందేళ్లు ఉంటాయి. అలా మూడు యూనిట్లు అంటే 24ఆడ, 6 మగ కుందేళ్లు వచ్చాయి. అప్పట్లో ఒక్కో యూనిట్ రూ.13000 చొప్పున రూ.39000 వేలు ఖర్చయింది. వీటిని ప్రత్యేకంగా పెంచడానికి జాలీలు అవసరం. వీటిని కొత్తవాటిని తయారు చేయాలంటే బాగానే ఖర్చయేది. కానీ నేను ఈ వేరే వాళ్ల దగ్గర సెకెండ్ హ్యాండ్ లో కొనుగోలు చేశాను. దాదాపు నాలుగు జతలకు రూ.60వేలు ఖర్చయింది. మొత్తంగా రూ.5లక్షల పెట్టుబడితో కుందేళ్ల పెంపకం ప్రారంభించాను.
వాటి నుంచే మిగతావి ఉత్పత్తి…
ప్రారంభంలో నేను తెచ్చిన మూడు యూనిట్ల కుందేళ్ల నుంచే మిగతావి అన్నీ ఉత్పత్తి అయ్యాయి తప్ప మరోసారి నేను కొనుగోలు చేయలేదు. నా దగ్గర ఇప్పుడు 180 బ్రీడర్లు ఉన్నాయి. చాలా సార్లు మధ్యలో పిల్లల్ని కూడా అమ్మాం. ఈ షెడ్డులో నేను, నా భార్య పనిచేస్తాం. అప్పుడప్పుడు మా అమ్మ సహాయకారిగా ఉంటుంది. కుందేళ్ల కోసం ఎకరంన్నరలో కొన్ని ప్రత్యేక గడ్డి జాతులను పెంచుతున్నాం. హెజ్యుల్యూస్, కోఫై, కోఎస్ఎఫ్-31 లు వీటికి మేతగా వేస్తాం. శీతాకాలంలో ఈ మూడు రకాల గడ్డిజాతుల ఎదుగుదల ఉండదు. ఈ సమయంలో అదనంగా మరో పాతికలో గడ్డి రకాన్ని పెంచుతున్నాం. వేసవి, వానా కాలంలో మళ్లీ గడ్డి బాగానే ఎదుగుదలకు వస్తుంది.
ఉదయాన్నే వస్తా..
రోజూ ఉదయం 5.30 గంటలకు వస్తాను. షెడ్ నిర్వహణ చూస్తుంటాను. ఇక్కడి నుంచి మా ఊరు కిలోమీటరు పైగా ఉంటుంది. కుందేలు మేత తిందా.. లేదా.. విసర్జించిందా.. ప్రతి కుందేలను పరిశీలిస్తాను. పిల్లలతో సహా అన్నింటిని బయటకి తీసి చెక్ చేస్తాను. కుందేలు కొంచెం బద్ధకంగా ఉంటే మనకు అర్థం అవుతుంది. కుందేళ్లు మొత్తం 30-35 రకాలు ఉంటాయి. నా దగ్గర ఏడు నుంచి ఎనిమిది రకాల జాతులు ఉన్నాయి. ఉదాహరణకు న్యూజిలాండ్ వైట్ రకానికి చెందిన కుందేలు కళ్లు ఎర్రగా ఉంటాయి. శరీరం తెలుపు రంగులో ఉంటుంది. దీనిని ప్రయోగాలకు సైతం తీసుకు వెళ్తుంటారు. వైట్ జెయింట్, రష్యన్ బ్రీడ్, డచ్, క్రాస్ బ్రీడ్, గోల్డ్ స్పార్క్ ఇలా ఉన్నాయి. కుందేలును సాధ్యమైనంత వరకు చెవులు పట్టుకొనే పైకి తీయాలి. పరిశీలించాలి. పొట్ట దగ్గర పట్టుకోకూడదు. అలా పట్టుకుంటే దాని అవయవాలపై ప్రభావం చూపుతుంది. దీని మరోపేరే చెవుల పిల్లి.
ఒక్కో కుందేలు 2-12 పిల్లలు పెడుతుంది
ఒక్కో కుందేలు సాధారణంగా రెండు నుంచి పన్నెండు పిల్లల వరకు పెడుతుంది. అయితే 6 నుంచి 8 వరకు పెడితే పిల్లలతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మగ కుందేలు ఆడ కుందేలు క్రాసింగ్ అయిన తర్వాత దానిలో మార్పులు గమనించవచ్చు. అది విజయవంతం అయిందా లేదా అని. దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో దాని శరీరంలో మార్పులు వస్తుంటాయి. శరీర పరిమాణ పెరగడం, పొట్ట భాగం లావవడం వంటివి. పొట్ట అడుగు భాగంలో చేయి వస్తే పిల్లలు కదిలినట్లు అనిపిస్తాయి. బలంగా నొక్కితే చనిపోయే ప్రమాద ముంది. అనుభవం మీద ఇది తెలుస్తోంది. దాదాపు నెల రోజుల వ్యవధిలో పిల్లల్ని కంటుంది. ఏది ఎప్పుడు క్రాసింగ్ జరిగిందో పేపర్ మీద రాసి దాని బోను వద్ద ఉంచుతాం.
ఏడాదికి నాలుగైదు సార్లు పిల్లల్ని పెడుతుంది
కుందేలు ఏడాదికి నాలుగు నుంచి ఐదు సార్లు పిల్లలు కంటుంది. ఇలా కన్న పిల్లల్ని 35-40 రోజలు మధ్య పెట్ షాపులకు ఇస్తుంటాను. పుట్టిన తొలి వారం పూర్తిగా తల్లి పాల మీద ఆధారపడతాయి. ఆ తర్వాత 10-12 రోజులు అయ్యే సరికి గడ్డి తింటుంది. తల్లి చేసే లక్షణాలను అనుసరిస్తూ ఉంటుంది. నెల రోజులు దాటిన తర్వాత 300-400 గ్రాముల బరువు వరకు ఉంటాయి.
శ్రమతో కూడిన ఆదాయం..
పెట్ షాపుల వారికి ఒక్కో జతను రూ.450 చొప్పున విక్రయిస్తున్నాను. పెద్దవి కావాలంటే రూ.700 వరకు తీసుకుంటాం. జత అంటే ఆడ, మగ అని కచ్చితంగా ఏమీ లేదు. ఏవైనా రెండు కలిపి రూ.450 కి ఇస్తాను. దాదాపు హైదరాబాద్ లోని అన్ని పెట్ షాపుల వాళ్లు నా దగ్గరకి వస్తారు. వీటితో పాటు బ్రీడర్స్ కూడా విక్రయిస్తుంటాను. పిల్లల్ని పెంచి నేను తీసుకువచ్చినట్లే ఒక్కో యూనిట్ ను రూ.13000 లకు విక్రయిస్తున్నాను. ఎనిమిది ఆడవి, రెండు మగవి. అయితే అన్ని బ్రీడింగ్ కి రావు. పుట్టిన పిల్లల్లో మేలైన వాటిని ఎంపిక చేసుకొని బ్రీడింగ్ కు పెంచాలి. మొత్తం నా దగ్గర 180 బ్రీడర్లు ఉన్నాయి. అంటే దాదాపు నెలకు 50-60 వరకు పిల్లలు పెడుతూ ఉంటుంది. రోజూ నాలుగైదు బ్రీడర్లు పిల్లలు పెడుతూ ఉంటాయి. అయితే వాటి ఆరోగ్య పరిస్థితులు గమనించి వాటిని క్రాసింగ్ కి ఉంచుతాం. వీటికి జబ్బులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే వీటి గురించి నేను ముందుగానే తెలుసుకొని ఉన్నాను కాబట్టే ఈ కుందేళ్ల పెంపకంలో విజయవంతం అయ్యాను. నెలకు ఎంత లేదనుకున్నా రూ.50-60 వేల వరకు ఆదాయం వస్తోంది. ఏడాది పొడవునా ఆదాయం ఉంటుంది. రోజుకి నాలుగైదు గంటలు షెడ్ లో పనిచేస్తుంటాను.
గడ్డితో పాటు దాణా
మధ్యాహ్న సమయంలో గడ్డి కోసి ఒకేసారి మేత వేస్తాను. దీంతో కొన్ని రకాలను కలిపి మిక్చర్ గా చేసి మేతగా వేస్తాం. మక్కా 50 కేజీలు, 25 కేజీల గోధుమ పొట్టు, 22 కేజీల పల్లీ చెక్క, కేజీన్నర ఉప్పు, కేజీన్నర మినరల్ మిక్చర్ లను వేస్తాం. ఇలా వంద కేజీల పరిమాణం చేసి వాటిని మేతగా వేస్తాం. నేను కుందేళ్ల సాగు ప్రారంభించిన తొలి నాళ్లలో మక్కా కేజీ రూ.800 ఉంటే.. ఇప్పుడు రూ.1300 వరకు అయింది. రోగాలకు సీజన్ అంటూ ఏం ఉండదు. ఎప్పుడైనా రావొచ్చు. ఎక్కువగా గజ్జి, ఊపిరితిత్తుల్లో నిమ్ము లాంటి వ్యాధులు వస్తుంటాయి. పుట్టిన అన్ని పిల్లలు బతకవు. అంటే రాత్రి సమయాల్లో కుందేళ్లు ఎక్కువగా ప్రసవిస్తూ ఉంటాయి. దీనివల్ల పుట్టిన పిల్లల్ని కొన్ని తొక్కేస్తుంది. దీంతోపాటు పుట్టిన పది రోజులు బతికి ఉంటే తర్వాత అవి నిలదొక్కుకుంటాయి. దీని నుంచి అదనపు ఆదాయం అంటూ ఏమీ ఉండదు. వీటికి ఫ్యాన్లు పెట్టి ప్రత్యేక పరిస్థితుల్లో పెంచాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ షెడ్ ను మాత్ర పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శారీరక శ్రమ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే సునిశిత పరిశీలన అవసరం. మొత్తంగా కుందేళ్ల పెంపకం చాలా బావుంది.
సాగులో నూతన పంటలు వేసి వైవిధ్యంగా పండించి లాభాలు గడించే వారిని మనం చూసుంటాం. అలా కాకుండా మనం సరదాగా పెంచుకునే జంతువులను షెడ్ తయారు చేసి ఎవరూ ఊహించని విధంగా ఆదాయం గడిస్తున్న సురేందర్ రెడ్డి గారు పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_1989-150x150.jpg)
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_9331-150x150.jpg)
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_9320-150x150.jpg)
![](https://rythubadi.com/wp-content/uploads/2024/05/IMG_9316-150x150.jpg)